BRS : రాజధానిలో బీఆర్ఎస్ ఖాళీ? పార్టీని నడిపించే నాయకుల కోసం కేసీఆర్ కసరత్తు?

BRS : ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందో లేదో.. ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. కనీసం అసెంబ్లీలో మాట్లాడే చాన్స్ కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.

who will lead brs in some constituencies

రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. రాజధాని ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దానికి కారణం హైదరాబాద్ ను డెవలప్ చేయడం.. అది కళ్ల ముందు కనిపించడం, అందులోనూ రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది నాన్ లోకల్స్ ఉండటం.. వాళ్లు కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దాని వల్ల రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. కానీ.. అదంతా ముణ్నాళ్ల ముచ్చటే అయింది. ఎందుకంటే.. ఇప్పుడు రాజధాని ప్రాంతం మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని పటిష్ఠం చేయడం అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఒకవేళ అనర్హత వేటుకు గురైతే.. ఉపఎన్నిక వస్తే మళ్లీ ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరిని నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించాలి అనే దానిపై పార్టీ అధినేత కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఉపఎన్నిక వచ్చినా.. లేక భవిష్యత్తులో మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తమకే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వాల్సిందే అని కొందరు నేతలు ముందే అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారట. అసలు పార్టీని ముందు మనుగడలో ఉంచాలంటే పార్టీ యాక్టివ్ లో ఉండాలంటే నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీలను నియమించి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని అధిష్ఠానం ఆలోచిస్తుంటే పార్టీ నేతలు మాత్రం షరతుల మీద షరతులు పెడుతున్నట్టగా తెలుస్తోంది. మరి దీనిపై కేసీఆర్, కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Author