Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తోంది. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత జనవరిలో స్విట్జర్లాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సుకు వెళ్లారు. తాజాగా రాష్ట్రానికి పలు పెట్టుబడులు తీసుకురావడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. పెట్టుబడుల కోసం విదేశాలకు తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లనున్నారు.
అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటన కోసం ఆయన బయలుదేరనున్నారు. ఆగస్టు 3 నుంచి 14 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతి కుమారి, జయేశ్ రంజన్, విష్ణువర్థన్ రెడ్డి, ఇతర అధికారులు వెళ్లనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనుండగా, ఈనెల 4 న మంత్రి శ్రీధర్ బాబు, 5 వ తారీఖున మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యూఎస్ పర్యటనకు వెళ్లనున్నారు. వీళ్లు రేవంత్ రెడ్డిని అక్కడ కలిసి అందరూ కలిసి యూఎస్ లో పలు కంపెనీ అధికారులతో భేటీ కానున్నారు.
న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో పలు కంపెనీల దిగ్గజాలతో పెట్టుబడుల విషయంపై చర్చించనున్నారు. 10 వ తారీఖు నుంచి అమెరికాలో బయలుదేరి 11వ తారీఖున సౌత్ కొరియాలోని సియోల్‌కి చేరుకొని అక్కడ ఉన్న పలు కంపెనీల అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం ఈనెల 14న తెలంగాణకు సీఎం బృందం తిరిగి రానుంది.