Crop Loan Waiver Scheme : తెలంగాణ రైతు రుణమాఫీపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. అసలు ఎంత వరకు రుణమాఫీ చేస్తారు.. దానికి ప్రామాణికం ఏంటి.. అనే విషయాలపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎన్నికల ముందు మాత్రం అన్ని లోన్స్ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు రుణమాఫీపై నోరు మెదపలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు రుణమాఫీపై ప్రకటన చేసింది. ఒక రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు ఫిట్టింగ్ ఉంది. రుణమాఫీ కోసం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
దానికి సంబంధించిన ఆర్టీ నెంబర్ 567 ను జారీ చేసింది. దాని ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్స్ తీసుకున్న వాళ్లకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. డైరెక్ట్ గా రైతుల లోన్ ఖాతాలోనే రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. దాని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను తీసుకురానుంది ప్రభుత్వం. ముందుగా తక్కువ లోన్ తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ ఆ తర్వాత గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు.
Crop Loan Waiver Scheme : ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఎలా?
ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే.. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించాలి. అప్పుడే ఈ 2 లక్షల రుణం మాఫీ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు రుణమాఫీ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం ఏంటంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి మార్గదర్శకాలు చెప్పలేదు.. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకే రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే అప్పుడు అలా చెప్పారా? కేవలం ఆరు నెలల్లోనే మాట మార్చిన రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రైతులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.