YCP : ఏపీలో పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం ఉంది. ఫలితాలకు ఇంకా సమయం ఉంది. దాంతో ఇప్పుడు పార్టీల్లో ఎన్ని సీట్లు ఏ పార్టీకి అనే చర్చ జోరుగా సాగుతోంది ఈ క్రమంలోనే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వైసీపీ మొన్నటి వరకు తమకు 175 సీట్లు వస్తాయని రెండేళ్లుగా చెప్పుకుంది. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ తర్వాత పొత్తులు కుదరడంతో పాటు చంద్రబాబు జైలుకు వెళ్లడం టీడీపీకి సానుకూలత బాగా పెరిగింది. దాంతో పాటు బీజేపీ కూడా కలిసి రావడంతో చంద్రబాబుకు బలం బాగా పెరిగిందనే చెప్పుకోవాలి.
YCP : అక్కడ 40 సీట్లు పక్కా..
అందుకే ఇప్పుడు వైసీపీ 175 వస్తాయని మాత్రం చెప్పలేకపోతోంది. ఇక అటు టీడీపీ కూడా తమకు 160 సీట్లు వస్తాయని మీదకు చెబుతున్నా ఏపీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లు వస్తే చాలు అనుకుంటోంది. అయితే ఇటు వైసీపీకి మాత్రం ఓ నెంబర్ హాట్ ఫేవరెట్ అయిపోయిందంట. అదే 95 సీట్లు. చాలా లెక్కల తర్వాత ఈ నెంబర్ దగ్గరకు వచ్చి ఆగింది ఆ పార్టీ. ఎందుకంటే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 సీట్లు ఉన్నాయి. ఇందులో 12 సీట్లు ఈ సారి తగ్గినా కనీసం 40 సీట్లు పక్కా వస్తాయని నమ్ముతోంది. అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి 10 సీట్లకు తక్కువ వైసీపీకి రావంటున్నారు. ఇక క్రిష్ణా గుంటూరులలో మొత్తం 33 సీట్లు ఉన్నాయి.
ఇందులో ఎంత వ్యతిరేకత ఉన్నా సరే కనీసం 15 సీట్లు కచ్చితంగా వస్తాయంటున్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కలిపి మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో సగానికి సగం అంటే 30 సీట్లు ఖాయమని వైసీపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. వీటిన్నింటినీ కలిపితే 88 మ్యాజిక్ ఫిగర్ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ కాస్త ఓటింగ్ సరళి ఇటువైపు ఎక్కువగా ఉంటే కచ్చితంగా ఇంకో ఏడు చోట్ల గెలుస్తామని అంటున్నారు. మొత్తం కలిపితే 95 సీట్లు వస్తాయంటున్నారు. కాబట్టి ఇంకోసారి అధికారం మనదే అని వారు ధీమాగా ఉంటున్నారు. అయితే వైసీపీ ఆశించినట్టు జరుగుతుందా.. లేదంటే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.