BJP : తెలంగాణలో కొట్టుకుపోతుంది అనుకున్న కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి వచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ పార్టీకి ఇప్పుడు మళ్లీ గ్రాఫ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని అటు ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు కాంగ్రెస్ త్వరలోనే కూలిపోతుంది అంటూ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానిపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తోంది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని లోకల్ ప్రభుత్వాలను కూలుస్తూనే ఉంది.
BJP అందులో భాగమేనా..?
మహారాష్ట్రలో శివసేనను చీల్చి షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు బీహార్ లో నితీష్ కుమార్ ను బుట్టలో వేసుకుంది. మధ్య ప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియాను తమ పార్టీలో చేర్చుకుని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగమే. అయితే ఇటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే మోడీ-షాలు తమ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారనే అప్రదిష్టను మూటగట్టుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొదటి నుంచి పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వారిని కాదని రేవంత్ ను సీఎం చేసింది. అయితే అప్పటి నుంచే రేవంత్ మీద వారిద్దరూ గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దీనికి బలం చేకూర్చేలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రీసెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ.100 కోట్లు పంపారని.. దీన్ని బట్టి ఆయన కూడా సీఎం రేసులో ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రీసెంట్ గా ఓ పెద్ద డీల్ జరిగిందని.. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ డబ్బులు ఢిల్లీకి పంపినట్టు చెప్పారు.
అయితే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలపై ఇప్పటి వరకు ఉత్తమ్ గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. మరి వారు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.