AP – Telangana polling : ఎన్నాళ్ల నుండో వేచిన సమయం వచ్చింది. గత కొద్ది రోజులుగా ఎన్నికలకి సంబంధించి జోరుగా ప్రచారాలు సాగగా, వాటికి మే 11తో తెరపడింది. ఇక ఈ రోజు పోలింగ్ అనేక జాగ్రత్తల మధ్య నడుస్తుంది. ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కాస్త నెమ్మదిగా ప్రారంభమైన తర్వాత మాత్రం పుంజుకుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
AP – Telangana polling పోలింగ్ వేగం పుంజుకుంది..
కొన్ని కేంద్రాలలో వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతుంది. వర్షం తగ్గితే పోలింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల మధ్య చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఏపీ, తెలంగాణల్లో 50%దాటి పోలింగ్ కొనసాగుతుంది. 3గంటల సమయానికి ఏపీలో ఇప్పటికి 52.01% పోలింగ్ జరగగా, తెలంగాణలో 52.30% పోలింగ్ జరిగింది.
ఏపీలో ఉత్తరాంధ్రలో కాస్త మందకొడిగా పోలింగ్ సరళి నడుస్తుంది. విశాఖ, అరకుల్లో తక్కువగా 40%లోపు మాత్రమే పోలింగ్ జరగగా, తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో 63.94%పోలింగ్ జరిగింది. మెదక్లో 60.94 శాతం పోలింగ్ నమోదు జరిగింది. వరంగల్లో 54.17 శాతం పోలింగ్ నమోదు, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్ నమోదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్లో ఇప్పటి వరకు 29.03 శాతం పోలింగ్ నమోదు అయింది.పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.