YS Jagan : ఏపీ మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్ ఇవాళ పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇవాళ దివంగత సీఎం వైఎస్సార్ 75వ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన వైఎస్ జగన్.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇడుపులపాయలో వైఎస్సార్ కు సమాధి నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన సమాధి వద్ద వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ ఇద్దరూ ఎన్నికల తర్వాత కలవడం ఇదే తొలిసారి. వైఎస్సార్ ఘాట్ కు వైఎస్ కుటుంబ సభ్యులు చేరుకొని నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ కు జగన్ దంపతులు నివాళులర్పించారు.
వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం తన తల్లిని కౌగిలించుకున్న జగన్.. వెళ్లొస్తా అని నమస్కారం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైఎస్ విజయమ్మను వైఎస్సార్ కుటుంబ సభ్యులు పలకరించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వైసీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.