KCR : బీఆర్ఎస్ పార్టీ ఒక పదేళ్ల క్రితం ఎలా ఉండేది. టీఆర్ఎస్ పేరుతో ఉన్న ఈ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 2014 ఎన్నికల్లో అయితే విజయదుందుబి మోగించింది. కేసీఆర్ తన సత్తా ఏంటో ఆ ఎన్నికల్లో చూపించారు. అంతే కాదు.. 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. వరుసగా రెండు సార్లు విజయం సాధించి కేసీఆర్ తన సత్తాను దేశానికి చాటారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగానూ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు కేసీఆర్. పార్టీ పేరును మార్చడం, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం.. బహిరంగ సభలు నిర్వహించడం.. ఇలా బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇక విస్తరించి దేశంలో కీలక పాత్ర పోషిస్తుంది అని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకే కాదు.. ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా నమ్మకం పోయినట్టుగా తెలుస్తోంది. అందుకే పార్టీ నుంచి ఒక్కొక్కరు వీడిపోతున్నారు. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.
KCR : కేసీఆర్ వెన్నంటే ఉన్న కేకే కూడా ఎందుకు రాజీనామా చేశారు?
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటనే ఉన్నారు కేకే(కే కేశవరావు). ఆయన కూడా చివరకు పార్టీని వీడటంతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికి రాజీనామా చేసి మరీ.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తానని కేకేకు మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే.. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే.. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తెలంగాణకు రాగానే.. గురువారం అర్ధరాత్రి హడావుడిగా బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు.
అంతకుముందే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చాలామంది చోటామోటా నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే మిగిలే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు పార్టీని వీడటంతో ఏం చేయాలో కేసీఆర్ కు పాలుపోవడం లేదు. ఉన్న నేతలు కూడా పార్టీలో ఉంటారా అనేది డౌటే. వాళ్లంతా పార్టీని వీడకుండా ఉండేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. కేకే లాంటి కీలక నేతలే పార్టీని వీడటంతో రానున్న రోజుల్లో మిగితా నేతలు కూడా కారు దిగే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలు ఏంటో వేచి చూడాల్సిందే.