Pawan Kalyan – Varma : ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ప్లస్ అయింది. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. ఏపీకి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యారు. నిజానికి.. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోయి ఉంటే.. అక్కడి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేసి ఉండేవారు.
ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ఆయనకు పిఠాపురం టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా రెడీ అయ్యారు కానీ.. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వర్మను పక్కన పెట్టి పవన్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అంటే.. పవన్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.
Pawan Kalyan – Varma : ఎన్నికల తర్వాత పవన్ మారిపోయారా?
ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఆ వర్మకు పవన్ అన్యాయం చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీ శాసన మండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల ఎంపిక విషయంలో ఈ చర్చ బలంగా వినిపిస్తోంది. ఈనెల 12న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు రెడీ అయ్యారు. ఎలాగూ ఎక్కువ ఎమ్మెల్యేల బలం కూటమికే ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులే ఎమ్మెల్సీలు కాబోతున్నారు.
వైసీపీ పార్టీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీ పోటీలో కూడా ఉండదు. అంటే.. ఖాళీ అయిన రెండు శాసన మండలి స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అనే చెప్పుకోవచ్చు. టీడీపీ నుంచి సీ రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ ను నామినేట్ చేశారు.
కానీ.. పవన్ కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మను మాత్రం పక్కన పెట్టారు. ఆయన్ను నామినేట్ చేయలేదు పవన్ కళ్యాణ్. అదే ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారు అని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు.
వర్మకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు.. ఖచ్చితంగా ఎమ్మెల్సీని చేస్తామని అటు చంద్రబాబు, ఇటు పవన్ మాటిచ్చారట. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీని చేసే చాన్స్ వచ్చినా.. వర్మను పక్కన పెట్టి వేరే వాళ్లను ఎమ్మెల్సీలను చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. తొలి ప్రాధాన్యత ఎందుకు వర్మకు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. దీనిపై సీఎం గానీ.. డిప్యూటీ సీఎం గానీ ఎలా స్పందిస్తారో?