Telangana Minister Damodara Raja Narsimha : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇప్పటికే కేటాయించిన పలు శాఖల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా మరో ఐదారుగురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చాన్స్ ఉంటుందని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆయన.. మరో ఐదుగురు లేదా ఆరుగురికి తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని.. పలు శాఖలలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
సీతక్కకు హోం శాఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించడంతో మంత్రివర్గ విస్తరణ నిజమే అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
మరి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో.. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.