Central Cabinet : చంద్ర‌బాబు కేబినేట్ నుండి కేంద్రంలో మంత్రి ప‌దవి పొందేది వీళ్లేనా?

Central Cabinet : ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుతీర‌బోతుంది. ఈ నెల 9న రాత్రి ఏడున్నర గంటలకు కేంద్ర మంత్రివర్గం ప్రమాణం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అరవై మంది వ‌రకు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఏపీ నుండి కేంద్ర మంత్రులుగా టీడీపీ కోటాలో నలుగురు జనసేన కోటలో ఒకరు ప్రమాణం చేసే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నుంచి ఒకరూ లేదా ఇద్దరు మంత్రులు అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. కేంద్ర కేబినెట్‌లో భాగస్వామి అయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే… రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జనసేన సభ్యులకూ కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కనుంది.

Central Cabinet వారికే ఛాన్స్ ద‌క్క‌నుందా?

కేంద్రంలో కేబినెట్‌తోపాటు ఇండిపెండెంట్‌ చార్జి మంత్రులు, సహాయ మంత్రి పదవులు ఉంటాయి. వీటిలో కేంద్ర కేబినెట్‌ పదవి స్థాయి ఎక్కువ. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ పదవి లభించే అవకాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ (గుంటూరు), వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి (నెల్లూరు), దగ్గుమళ్ళ ప్రసాదరావు (చిత్తూరు)కు కూడా అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. జనసేన తరఫున ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో బాలశౌరి (మచిలీపట్నం) సీనియర్‌. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (రాజమహేంద్రవరం)కి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. సీఎం రమేశ్‌ (అనకాపల్లి) కూడా బీజేపీ నుంచి మంత్రి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు

జనసేన నుంచి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. అయితే, గుంటూరు కు ప్రాధాన్యత ఇస్తే…ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు అవకాశం ఉంటుందా లేదా అనేది చర్చగా మారుతోంది. రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుంది. సీనియర్ ఎంపీగా ఉన్న హిందూపురం నుంచి గెలిచిన పార్ధసారధి పేరు పరిశీలనలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు ఖాయం కావటంతో..సీమ నుంచి ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు..బీజేపీ అధినాయకత్వం చర్చల సమయంలో ఈ మంత్రివర్గ స్థానాలు – శాఖల పైక కసరత్తు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Author