Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో రైతు రుణమాఫీపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 18 సాయంత్రం లోపు లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. ఒకేసారి కాకుండా పలు విడతల్లో రైతు రుణమాఫీని ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
రైతు రుణమాఫీకి ఎవరు అర్హులు, ఎవరు కాదు.. అనే దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరు కల్లా రుణమాఫీ మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జులై నెలాఖరు లోపు రూ.1.5 లక్షల లోపు రుణం ఉన్న వాళ్లకు మాఫీ చేస్తామని.. ఆగస్టు నెలాఖరు కల్లా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
Revanth Reddy : ఈ దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి
ఈ దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలని.. వ్యవసాయంలో తెలంగాణ అవలంభించే విధానాలు దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు సీఎం. ఇది తన జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని రోజని.. ఒకేసారి రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ చేస్తున్నామని.. తాము చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి కోరారు.