Telangana Budget : ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ కేటాయింపులు మూడు లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు కేబినేట్ భేటీ జరుగుతుంది. ఆ భేటీలో బడ్జెట్ కు ఆమోదం లభించిన తర్వాత బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసనమండలిలో బడ్జెట్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు.
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఆరు రంగాలకు కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ, రైతు భరోసా లాంటి పథకాల అమలు కోసం వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయనుంది. అలాగే సంక్షేమ పథకాల కోసం సంక్షేమ శాఖకు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్, వైద్య శాఖ, విద్యుత్ శాఖ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భారీగా కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది.