Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా.. హోం మంత్రిగా రాష్ట్రాన్ని నడిపించబోతున్నారా అంటే చాలామంది నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. పవన్ ఈసారి ఎన్నికల్లో 21 సీట్లకు మొత్తం తన పార్టీ తరఫున గెలిపించుకున్నారు. తాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. కూటమి విజయానికి ఆక్సిజన్ గా మారారు.చంద్రబాబు సైతం ఆయన పట్ల పూర్తి అభిమానం కనబరుస్తున్నారు. సినీ గ్లామర్ నిండుగా ఉన్న పవన్ కి బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. అదే సమయంలో యువత మొత్తం పవన్ కోసం ఊగిపోయే నేపథ్యం ఉంది.
ఇలా అన్నీ కూడా కలిసి పవన్ కూటమి విజయంలో తన వంతు పాత్రను విజయవంతంగా పోషించారు. దానికి గానూ ఆయనకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కి టీడీపీ కూటమి ప్రభుత్వంలో అప్పగించే బాధ్యతలు ఏమిటి అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమైన హోం శాఖతో కూడిన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంచుకుంటారు అని అంటున్నారు. మరి చంద్రబాబు ఏయే శాఖలు అప్పగిస్తారన్నది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో అయితే సముచితమైన స్థానం ఇస్తారు అని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎం గా ఉండడం అంటే ప్రభుత్వానికే ఒక కళ ఉంటుందని అభిమానులు అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండడం అన్నది కొత్త కాదు. 2014లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చారు. ఇపుడు ఆయన పవన్ ఒక్కరికి ఇస్తేనే ఆ పదవికి ఒక అర్థం, అందం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మాత్రం 2024 ఎన్నికల తరువాత కొత్త మలుపు తీసుకోనుంది అన్నది వాస్తవం అంటున్నారు. ఒకప్పుడు పవన్ సభలు పెట్టినప్పుడు అభిమానులంతా సీఎం, సీఎం అని అరిచేవారు. అయితే వాస్తవాలను గ్రహించాలని ఆయన చివరికి అందరికీ సర్ది చెప్పారు.
తమ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీలో బలమైన ప్రాతినిథ్యం కావాలని భావించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పరచి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయలేదు. దాని ఫలితంగా ప్రస్తుతం కూటమి చరిత్రలో గుర్తుండిపోయే మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వంలోనూ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం పుష్కలంగా ఉంది. ఏదేమైనా పదవుల అంశం చంద్రబాబు, పవన్ కలిపి చూసుకుంటారని, ఏ పదవి చేపట్టాలనేది పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.