Sabitha Indrareddy : సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. మహిళలంటే అంత చులకన ఎందుకు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడింది. అయితే.. సభలో ఇవాళ జరిగిన గొడవపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడారన్నారు. శాసనసభలో ఏం జరిగిందో అందరం చూశాం. ప్రజలు కూడా చూశారు. ఒక ముఖ్యమంత్ర స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం ఏంటి? బడ్జెట్ పై కేటీఆర్ ఒక్కో విషయంపై క్లారిటీ ఇవ్వబోతుండగా కేటీఆర్ ప్రసంగాన్ని పక్కకు తప్పించేలా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సబితా రెడ్డి ఆరోపించారు.
ఇది కేవలం నాకో, లేక సునీతకో జరిగిన అవమానం కాదు. యావత్ తెలంగాణ సమాజంలోని మహిళలకు జరిగిన అవమానం. నేను ఇప్పుడు కాదు.. 24 ఏళ్ల నుంచి అసెంబ్లీకి వస్తున్నాను. ఎందరో ముఖ్యమంత్రులను చూశాను కానీ.. ఎవ్వరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన తగ్గించే విధంగా మాట్లాడారు. ఒకవేళ మహిళలంటే సీఎంకు గౌరవం ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.