Crop Loan Waiver Scheme : తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జులై 18 సాయంత్రం లోపు లక్ష లోపు ఉన్న రుణాల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. పాస్ బుక్ ఆధారంగా లక్ష లోపు ఉన్న పంట రుణాల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అవ్వనున్నాయి. దానికి సంబంధించి బ్యాంకర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు అని.. కార్డు లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని.. అందులో 70 లక్షల మంది రైతులకు క్రాప్ లోన్స్ ఉన్నాయని తెలిపారు. అయితే.. 6.36 లక్షల మంది లోన్ తీసుకున్న వాళ్లకు రేషన్ కార్డులు లేవని.. వాళ్లకు కూడా రుణమాఫీ వర్తిస్తుందన్నారు సీఎం. అయితే.. రుణమాఫీ లక్ష జీతం, అంతకంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్లకు వర్తించదని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులెవ్వరికీ రుణమాఫీ పథకం వర్తించదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
విడతల వారీగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేని రైతుల దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులే వెళ్లి రుణాన్ని పరిశీలించి ఓకే చేస్తారన్నారు. మొత్తం 32 బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తామని.. తప్పుడు పత్రాలు పెట్టి రుణాలు తీసుకున్న వాళ్లకు రుణాలు మాఫీ కావని.. ఎక్కువ జీతం ఉన్నా కూడా వాళ్లకు రుణమాఫీ చేయడం కుదరదని.. అలాంటి ఖాతాలు రాష్ట్రంలో 17 వేల వరకు ఉన్నాయని మంత్రి తుమ్మల వెల్లడించారు.