New Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. చాలా ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇదిగో.. అదిగో అంటూ ఊదరగొట్టారు తప్పితే కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కింది.
ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
అందులో కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ఈ సబ్ కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా జారీ చేయనున్నారు. కాకపోతే రెండు కార్డులు విడివిడిగా ఇస్తారు. ఇక.. ఈ సబ్ కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మెంబర్స్ గా ఉంటారు.