Revanth Reddy : ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించిన తొలి విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ అందనుంది. తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లాయి. మొత్తంగా రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా లక్షన్నర రుణమాఫీ కానుంది. ఆగస్టు నెలాఖరులోగా రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
రైతు రుణమాఫీ కోసమే రూ.31 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రుణమాఫీ నిధులను కేవలం రుణమాఫీ కోసమే వాడాలని.. ఇతర అప్పులకు జమ చేయకూడదని బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం మాట్లాడిన రేవంత్ త్వరలో వరంగల్ లో రైతులతో కలిసి భారీ బహిరంగ సభ పెడతామన్నారు.
ఎల్లుండి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి.. వరంగల్ సభకు రాహుల్ ను ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం. నా జీవితంలో ఇది మరిచిపోలేని, మరుపురాని రోజు. రుణమాఫీపై అపోహలు సృష్టిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.