Nara Lokesh : హింస, విధ్వంసం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోంది.. నారా లోకేష్ ట్వీట్

Nara Lokesh : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తుందన్నారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రభుత్వం టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందన్నారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందన్నారు.

ap minister nara Lokesh fires on ys jagan

ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్.. తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Nara Lokesh : నేరాలు చేసి.. మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడమేగా?

నేరాలు చేసి.. మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదన్నారు. ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు.. ప్రజలకు, వారి మాన ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అంటూ నారా లోకేష్ ట్విట్టర్ లో జగన్ ను ఏకిపారేశారు.

Author