Gautam Gambhir : ఇటీవలే టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి తమ సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియాకు భారత్ క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలికిన విషయం తెలిసిందే. టీ 20 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత క్రికెట్ గురించి అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం గౌతమ్ గంభీర్ విషయం. ఎందుకంటే.. ఇప్పటి వరకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.
గౌతమ్ గంభీర్.. ఇక నుంచి టీమిండియాకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే.. అధికారికంగా ఇంకా గంభీర్ బాధ్యతలను తీసుకోలేదు. టీ20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్ కు బైబై చెప్పిన బీసీసీఐ.. కొత్త కోచ్ ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారో మాత్రం వెల్లడించలేదు.
Gautam Gambhir : ఈ వారమే భారత జట్టును ప్రకటించాల్సి ఉంది
ఇప్పటి వరకు హెడ్ కోచ్ ను బీసీసీఐ ప్రకటించలేదు. త్వరలో శ్రీలంక పర్యటన కూడా ఉంది. ఈ వారం టీమ్ ను కూడా ప్రకటించాలి. అయినా కూడా బీసీసీఐ ఎందుకు గంభీర్ ను హెడ్ కోచ్ గా అధికారికంగా ప్రకటించడం లేదు అని క్రికెట్ అభిమానులు బిత్తరపోతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ భారీగా జీతం అడుగుతున్నాడట. ఇప్పటి వరకు ఉన్న రాహుల్ ద్రవిడ్ సంవత్సరానికి రూ.12 కోట్ల జీతం తీసుకోగా.. అంతకంటే ఎక్కువే గంభీర్ అడుగుతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు.. 2027 వన్డే వరల్డ్ కప్ కి కూడా గంభీర్ హెడ్ కోచ్ గా ఉండాల్సి వస్తుంది. ఐపీఎల్ లోనూ పాల్గొనడానికి చాన్స్ ఉండదు. కేకేఆర్ టీమ్ కు మెంటర్ గానూ పని చేయడానికి కుదరదు. అందుకే హెడ్ కోచ్ గా ఉండేందుకు గంభీర్ భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. చూడాలి.. గంభీర్ డిమాండ్ కు బీసీసీఐ సై అంటుందా? లేక రెండో ఆలోచన ఏమైనా చేస్తుందా అని.