Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ షర్మిలే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇవాళ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరయిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు…
2029 లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని.. అలాగే.. ఏపీలో షర్మిల సీఎం అవుతారని జోస్యం చెప్పారు. వైఎస్ ఆశయాలను సాధించేలా ఏపీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహకరించాలన్నారు. 2009 లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వైఎస్ షర్మిల.. 2029లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. తండ్రి ఆశయాలను మోసేవాళ్లే వారసులు అని అన్నారు.
Revanth Reddy : వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల బాధ్యతలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నారని.. వైఎస్ పేరు వ్యాపారం చేసే వాళ్లు వారసులు కాదని.. ప్రజలంతా ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే.. కడపలో ఉప ఎన్నిక వస్తే కడప ఎంపీగా షర్మిలను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ అన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్నది బీజేపీ అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని దుయ్యబట్టారు. ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదన్నారు. అందరూ మోదీపక్షమే అన్నారు. ప్రతిపక్షాన నిలబడగలిగే ఏకైక నాయకురాలు షర్మిల అని రేవంత్ కొనియాడారు.