Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వినాయక చవితి వేడుకలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకల విషయంపై ఆయన పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చాలామంది వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడి విగ్రహాలను వాడుతుంటారు. అలాంటి విగ్రహాలను వాడితే పర్యావరణానికి చాలా ప్రమాదం అని.. ఆ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలనే పూజించేలా ఏపీ ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
Pawan Kalyan : పిఠాపురం నుంచే ఆ ప్రయోగం ప్రారంభం
ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించాలని… ఉత్సవాల్లో, వేడుకల్లో పర్యావరణహిత వస్తువులనే వాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వినాయక చవితి వేడుకల సమయంలోనూ మట్టి వినాయకుడిని పూజించాలన్నారు. అలా చేస్తేనే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని.. పలు దేవాలయాల్లోనూ ప్రసాదాల కోసం ప్లాస్టిక్ కవర్లు, బటర్ పేపర్లు వాడుతున్నారని.. వాటికి బదులు తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలన్నారు. ఈ ప్రయోగాన్ని ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల నుంచే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.