Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా జగన్ ఇంకా మారలేదు. తనకు ఇంకా తత్వం బోధపడలేదు. ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నట్టున్నారు.. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కూటమి పార్టీలు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ తీరును తప్పుపట్టారు.
ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలీసులతో గొడవ పెట్టుకుంటున్నారు.. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలేలా ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నారనే భ్రమలోనే ఉంటే ఎలా? అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం ముందే వైసీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ తో సహా నల్ల కండువా వేసుకొని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. నల్ల కండువాతో లోపలికి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ జగన్ పోలీసులపై ఫైర్ అయ్యారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.