Pawan Kalyan : ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి. ఎన్నికలు పూర్తయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కువగా వినిపించిన పేరు పవన్ కళ్యాణ్. ఆయన పేరు మాత్రం మారుమోగిపోయింది. పిఠాపురం అనే పేరు ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అయ్యాక తొలిసారి ఇవాళ ఫించన్ కార్యక్రమానికి పిఠాపురం వచ్చారు.
పిఠాపురానికి తొలిసారి పవన్ డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో పోలీసులు పిఠాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నారు.గత ప్రభుత్వాన్ని మొన్నటి దాకా తిట్టుకున్నాం.. విమర్శించాం. ఇప్పుడు చాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిస్ అయితే చేశామో.. ఆ ప్రామిస్ ను నిలబెట్టుకోవాలి. మేము వస్తే ఫించన్ విధానాన్ని రద్దు చేస్తామని గత ప్రభుత్వం విమర్శించింది కానీ.. మేము దాన్ని ఇంకా పెంచి ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan : రిషికొండలో రూ.600 కోట్లతో ప్యాలెస్ అవసరమా?
సంక్షేమ పథకాలు చాలా ముఖ్యం. వాటితో పాటు అభివృద్ధి కూడా కావాలి. పంచాయతీ రాజ్ శాఖ లెక్కలు చూస్తుంటే అడ్డగోలుగా నిధులు ఎటు వెళ్లాయో అర్థం కావడం లేదు. ఒక చిన్న రిజర్వాయర్ కోసం, కాలువ మరమ్మతు కోసం కోట్లకు కోట్లు తరలించారు. 600 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ కట్టారు. ఆ 600 కోట్లు ఖర్చుపెడితే ఒక జిల్లా బాగుపడేది. పంచాయతీ రాజ్ వ్యవస్థను నడిపే వ్యక్తిగా చెబుతున్నా. నా వైపు నుంచి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది. పారిశ్రామికంగా ఏం చేయాలి.. అనేది ఖచ్చితంగా చేస్తామన్నారు.
ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు. కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కు నిధుల కొరత లేదు. కానీ.. గత ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కోసం కేంద్రం నిధులు ఇస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ను ఇవ్వలేకపోయారు కానీ.. రిషికొండలో మాత్రం వందల కోట్లు పెట్టి బిల్డింగ్ లు కట్టారు.. అని పవన్ చెప్పుకొచ్చారు.