Union Budget 2024 : ఇవాళ కేంద్ర బడ్జెట్ 2024-25 ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఏపీ కోసం ప్రత్యేక సాయాన్ని కేంద్రం బడ్జెట్ లో ప్రకటించింది. గత ఐదేళ్ల కాలంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. 2019 నుంచి 2024 మే వరకు వైసీపీ హయాంలో ఏపీ నాశనం అయింది. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రాజధాని నిర్మాణంపై కూడా ఎలాంటి దృష్టి పెట్టలేదు. కొత్త రాష్ట్రం కావడంతో రాజదాని నిర్మాణానికి వేల కోట్ల ఖర్చు అవసరం అవుతుంది. అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఈనేపథ్యంలో కేంద్రం ఏపీ రాజధాని అమరావతి అభివృద్ది కోసం రూ.15 వేల కోట్లను బడ్జెట్ లో ప్రకటించింది.
ఇది ఒక రకంగా ఏపీ ప్రజలకు తీపి కబురు అనే చెప్పాలి. ఇప్పుడు మాత్రమే 15 వేల కోట్లు ప్రకటించామని.. భవిష్యత్తులో అవసరం మేరకు మరిన్ని నిధులు రాజధాని అభివృద్ధి కోసం కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేస్తామని, నిర్మాణానికి కావాల్సిన అనుమతులు, సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వాటితో పాటు ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. దాని కింద నిధులు విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ కోసం సపరేట్ గా నిధులు విడుదల చేస్తామని నిర్మల ప్రకటించారు. అలాగే.. వైజాగ్, చెన్నై కారిడార్ డెవలప్ మెంట్ కోసం కూడా ప్రత్యేక నిధులను ఇస్తామని హామీ ఇచ్చారు.