KTR : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడం, వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. వైఎస్ జగన్ ఓడిపోవడం ఏంటి.. అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పార్టీ ఓటమి తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కేటీఆర్. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఐదేళ్ల పాటు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వైఎస్ జగన్ ఓడిపోవడం ఏంటి అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవాళ ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడిన కేటీఆర్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. అది మామూలు విషయం కాదన్నారు. కేవలం వైఎస్ జగన్ ను ఓడించేందుకే వైఎస్ షర్మిలను కొందరు పావులా వాడుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR : కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి?
ప్రతి రోజు జనంలోకి వెళ్లి.. ప్రజల బాగోగులు కనుక్కొని.. వాళ్లకు ఏ సమస్య ఉన్నా తానున్నానంటూ ముందుండి నడిచే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం నిజంగా తనను షాక్ నకు గురిచేసిందన్నారు. పవన్ కళ్యాణ్ కూటమితో కలవకుండా జనసేన పార్టీ ఒంటరిగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. ఫలితాలు వేరే విధంగా ఉండేవని.. షర్మిలను పావులా వాడుకోవడం కోసం తప్పితే.. ఆమె ఏపీలో ఎన్నికల్లో చేసిందేం లేదని కేటీఆర్ నొక్కి చెప్పారు.