BRS vs Congress : అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? దాదాపు 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిక్కుబిక్కుమంటోంది. పార్టీలో ఉన్న నేతలను అధిష్ఠానం కాపాడుకోలేకపోతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి లాక్కున్న కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు ఫలించడం లేదు. అదే ఆపరేషన్ ఆకర్ష్ ను బీఆర్ఎస్ మీద ప్రయోగిస్తున్నాయి ఇతర పార్టీలు.
ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మరీ.. పదవుల ఆశ చూపించి మరీ తమ పార్టీలోకి లాక్కుంటోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధం అయ్యారు. హైదరాబాద్ లో అయితే దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ అయినట్టే అని చెప్పుకోవాలి. అధిష్ఠానం మాటలను రాజధాని పరిధిలోని కీలక నేతలు, కార్పొరేటర్లు పెడచెవిన పెడుతున్నట్టు తెలుస్తోంది. చాలామంది నేతలు కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
BRS vs Congress : బీఆర్ఎస్ సమావేశానికి డుమ్మా
బీఆర్ఎస్ నగర పార్టీ మీటింగ్ కు కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అందరూ రావాలని ముందే హుకుం జారీ చేసినా అధిష్ఠానం మాటలను పెడచెవిన పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు అయిన ఈ సమావేశానికి చాలామంది బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టడంతో అధిష్ఠానం మాటలను పెడచెవిన పెడుతున్నట్టుగా తెలుస్తోంది.