AP Rains : ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెగని వానల వల్ల, గోదావరి నదికి ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఏపీ మొత్తం జలమయమైంది. ఎక్కడ చూసినా వరదలు ఉప్పొంగుతున్నాయి. వాగులు, వంకలు నిండిపోయాయి. ఓవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉమ్మడి గోదావరి జిల్లాలపై పడటంతో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పెద్ద వాగు ప్రాజెక్టు ఉప్పొంగుతోంది. దీని వల్ల ఆ ప్రాజెక్టుకు పెద్ద గండి పడింది. దాని వల్ల.. పక్కనే ఉన్న గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దీని వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీ తీరం సమీపంగా పయనిస్తూ 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉంది. కనీసం 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.