AP Floods : ఏపీని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరిలోకి వరద నీరు భారీగా చేరడంతో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పోలవరం దగ్గర గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో దిగువ ప్రాంతాలకు 12,26,964 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం స్పెల్ వే దగ్గర 33.645 మీటర్లకు నీటిమట్టం చేరింది.
మరోవైపు ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అక్కడ 14.56 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల్లో పరిస్థితులపై కలెక్టర్ నాగరాణి ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అల్లూరి జిల్లా సీలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గుంటవాడ రిజర్వాయర్ కు వరద కొనసాగుతోంది. గుంటవాడ పూర్తిస్థాయి నీటిమట్టం 1360 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1358.4 అడుగులుగా ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. పాడేరు ఏజెన్సీలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ప్రమాదకరంగా వాగులు ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.