Union Budget 2024 : ఇవాళ కేంద్ర బడ్జెట్. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 నెలలు పూర్తి కాగా.. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను మరో 8 నెలలు మిగిలి ఉంది. ఆ 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ పై పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏమైనా ధరలు తగ్గిస్తుందేమోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో మోదీ 3.0 ప్రభుత్వంలోని తొలి బడ్జెట్ పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను, ఇతర పన్నులు, ధరల విషయాల్లో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు.