Anti Narcotics Bureau Telangana : రాష్ట్రంలో గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గంజాయి లాంటి డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. పకడ్బందీగా ఉన్నా కూడా ఎలాగోలా రాష్ట్రంలో గంజాయి చలామణి అవుతోంది. దీంతో ఏం చేయాలో పోలీసులకు పాలు పోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత డ్రగ్స్ కు బానిస అయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాంటీ నార్కొటిక్స్ బ్యూరో గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు నజరానా ప్రకటించింది. గంజాయి గురించి సమాచారం ఇస్తే చాలు.. రూ.2 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కనీసం 100 కిలోల కంటే ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ ఎక్కడైనా జరిగితే.. దాని గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే 8712671111 అనే నెంబర్ కు కాల్ చేసి వివరాలు చెప్పాలని పోలీసులు వెల్లడించారు. గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని.. అవి ఎవ్వరికీ తెలియవని.. గంజాయి గురించి సమాచారం ఇచ్చే విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.