Anna Canteens : అన్న క్యాంటీన్ల గురించి తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లకు ఉన్న ఆదరణ దేనికీ లేదు. పేదలకు ఈ క్యాంటీన్ ఒక వరం అనే చెప్పుకోవాలి. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడిచేవి. 2014 లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అన్న క్యాంటీన్లను ఏపీలో ప్రారంభించారు. కానీ.. 2019 లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అన్న క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్న క్యాంటీన్లను గత 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా వైసీపీ ప్రభుత్వం తెరవలేదు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ కూటమి గెలవడంతో అన్న క్యాంటీన్లకు మళ్లీ మహార్ధశ రానుంది…
టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్న క్యాంటీన్ల పున:ప్రారంభంపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు క్యాంటీన్లను 20 కోట్ల నిధులతో మరమ్మతులు చేస్తున్నారు. వచ్చే నెల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పున:ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Anna Canteens : అన్న క్యాంటీన్ల కోసం ఒక ట్రస్ట్
ఈసారి అన్న క్యాంటీన్లను ప్రణాళికాబద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం వెబ్ సైట్, సాఫ్ట్ వేర్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయిస్తున్నారు.