TGPSC : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఎంపీ మల్లు రవి తెలిపారు. త్వరలోనే గ్రూప్ 2, 3 పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు.
నిరుద్యోగులతో చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతలు, ఎంపీ మల్లు రవి.. నిరుద్యోగుల అభ్యర్థనలకు అంగీకరించారు. వచ్చే డిసెంబర్ లో గ్రూప్ 2 నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని నిరుద్యోగులు స్పష్టం చేశారు. అలాగే గ్రూప్ 2 పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
డీఎస్సీ పరీక్షలు జులై 18న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. జులై 18 నుంచి వచ్చే నెల 5 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే మధ్యలో ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఈనేపథ్యంలో తమకు ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోవడం లేదని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్టు మల్లు రవి నిరుద్యోగులకు తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు దాదాపు ఐదున్నర లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.