Revanth Reddy : బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. భూమి రిజిస్ట్రేషన్లు, పాస్ బుక్కులు, లాండ్ టైటిల్స్, ఇలా భూమికి సంబంధించిన అన్ని వివరాలను ఒకేచోట బీఆర్ఎస్ ప్రభుత్వం పోర్టల్ లో ఏర్పాటు చేసింది. కానీ.. ఆ పోర్టల్ లో సమస్యలు ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ధరణి సమస్యలపై పరిష్కారం కోసం అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. ధరణిలో సమస్యలతో పాటు, పోర్టల్ లో మార్పులు చేర్పులు, ఇతర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తే ఆ మార్పుల వల్ల ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
దాని కోసం ముందే ప్రజాభిప్రాయం తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ధరణి పోర్టల్ సమస్యలపై అసెంబ్లీలో చర్చ అయినా పెడదామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.