Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇదంతా ఒక ప్లాన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రజల్లో అయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చూసి కాంగ్రెస్ బడ్జెట్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునే కుట్రలో భాగమే ఇదంతా అంటూ బండి సంజయ్ ఆరోపించారు.
ముందు రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పై చర్చ జరగకుండా ఉండాలంటే, ప్రజలు ఆ బడ్జెట్ గురించి మరిచిపోవాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్రం బడ్జెట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక ప్లాన్ అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.
కేంద్రం బడ్జెట్ లో ఏవిధంగా నిధులు కేటాయించిందో, నిధులు కేటాయించబోతుందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కసారి సమీక్షించుకోండి. కొట్లాటలకు, విమర్శలకు అవకాశం ఇవ్వకండి. ప్రజలతో ఏర్పడిన మీ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలి. అభివృద్ధికి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కలిసి మెలిసి ముందుకు పోదాం. గత ప్రభుత్వపు మూర్ఖత్వపు విధానాలు మీరు పాటించకండి.. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.